ఆంధ్రప్రదేశ్ భాషాపరంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం అని మన అందరికి తెలుసు. మన ప్రాంతీయ భాష తెలుగు అని తెలుసు. పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడి, అశువులు బాసిన మహనీయుడు అని తెలుసు.

తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అంటారని తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగును "దేశభాషలందు తెలుగు లెస్స" (less కాదు సుమా!) అని కొనియాడిన సంగతీ తెలుసు. సి. పి. బ్రౌన్ అను ఆంగ్ల మహనీయుడు భారతదేశం వచ్చి, తెలుగు నేర్చుకొని, తెలుగు మీది మమకారంతో తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు సాహిత్యాన్ని వెలికి తీయించి, గ్రంథాలుగా ముద్రించి, తెలుగుకు అపార సేవ చేసిన విషయం తెలుసు. అంతే కాదు, ఆయన ఆంగ్లం నుండి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లానికి, నిఘంటువులు వ్రాసి, వాటిని ముద్రించి, మనకు అందుబాటులో ఉంచిన సంగతీ తెలుసు.

మరి ఇన్ని విశిష్టతలున్న తెలుగుభాష నేడు ఎంత నిరాదరణకు గురి అవుతున్నదో మనకెందుకు తెలియడం లేదు? ఈ నిరాదరణకు కారణం మనమే అని కూడా తెలియడం లేదే!

మనసుకు బాధ కలిగినా, శరీరానికి గాయమైనా అనాలోచితంగా, మన నోటి వెంట వెలువడే పదం "అమ్మ". ఇది ప్రేమతో కూడిన తెలుగువారి కమ్మని పదం. 'Mummy' అనే పదంలో ఈ కమ్మదనం మనకు కలుగుతుందా? క్రిందపడినప్పుడు 'అమ్మా'కి బదులు 'Mummy' అనగలమా? నేటి సమాజంలో 'అమ్మా అనే ఈ పదం ఆప్యాయతను కొల్పోయి, క్రింది ఉద్యోగస్తులు, పై ఉద్యోగినిని; పనిమనిషి, యింటి యజమానురాలిని సంబోధించడానికి పరిమితమవడం శోచనీయం.

ఇద్దరు తమిళులు కలిస్తే, తమిళంలో స్వేచ్ఛగా సంభాషించుకుంటారు. ఇద్దరు మరాఠీలు ఎదురైతే తనివితీరా మరాఠీలో కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఇద్దరు కేరళీయులు తారసపడితే మలయాళంలో మనసు విప్పి మాట్లాడుకుంటారు. మరి తెలుగు వారు.......? తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగులో సంభాషించుకోవడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారు? తెలుగు మాట్లాడటం అనాగరికం అని, ఎదుటివారు చిన్నచూపు చూస్తారని అనుకొంటున్నారే? వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు గాని, తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.

నా చిన్నప్పుడు స్కూల్లో కొంతమంది విద్యార్థులు 'తెలుగు 'ని 'తెగులు ' అని హాస్యాన్ని పలికేవారు. అప్పుడు మా టీచర్ వారి చెవి మెలిపెట్టి, 'తెలుగు ' అని వారిచే 100 సార్లు చెప్పించి, వ్రాయించేవారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 'నిజంగానే తెలుగుకి తెగులు పట్టిందా' అని.

ఈ మధ్య గమనిస్తున్నాను. విద్యార్థులు, తెలుగు మీడియంలో చదవడం వలన, కాలేజీలో ఆంగ్ల మాధ్యంలో చదవలేకపోతున్నాం అంటున్నారు. ఇది వాస్తవం కాదు. మాతృభాష మీద పట్టు సాధించినపుడు మాత్రమే విద్యార్థి మరే భాషనైనా నేర్చుకోగలుగుతాడు. నేటి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవలేక విఫలమవడానికి కారణం, మాతృభాషమీద పట్టు సాధించలేక పోవడమే. పూర్వం విద్యార్థులు ఎందరో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు స్కూల్లో తెలుగు మాధ్యమంలో చదివి, కాలేజి చదువులను ఆంగ్ల మాధ్యమంలో కొనసాగించి రెండు భాషలలోనూ పట్టు సాధించి ఉన్నత పదవులను అలంకరించి, ఎంతో కీర్తి గడించలేదా?

మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, మాతృమూర్తిని నిర్లక్ష్యం చేయడమే. ఇది క్షమార్హం కాదు. ఇప్పటికే తెలుగులో చాలా ఇంగ్లీషు పదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని పదాలను ఆంగ్లంలోనే వాడుతున్నాం. తెలుగు పదాలు వాడుకలోనే లేకుండా పోయినాయి. 'Road ' అంటే బాట అని చాలా తక్కువ మందికి తెలుసు. 'Pen ' అంటే తెలుసుగాని 'కలం' అంటే తెల్లముఖమే! 'Train' ని 'ధూమశకటం' అంటారని బహుకొద్ది మందికే తెలుసు. ఇలా కొన్ని తెలుగు పదాలు వాడుక నుండి తప్పుకున్నాయి. ఒక్క ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు మాట్లాడలేని పరిస్థితి మనది. దీనికి తోడు 'శ ' కు బదులు 'ష ' పలకడం నాగరికం అయిపోయింది. 'ఆకాశం'ని 'ఆకాషం'గా, 'అవకాశం'ని 'అవకాషం'గా, 'శేఖర్ 'ని 'షేఖర్ 'గా, 'శైలజ 'ని 'షైలజ 'గా పలుకుతూ, అదే నాగరికత అని మురిసిపోతున్నాం. తెలుగుని ఇంత కల్తీ చేస్తే, మనం మన భావితరాలకు స్వచ్ఛమైన తెలుగు అందివ్వగలమా?


అన్ని భాషలు సమానమని మనం గ్రహించాలి. ఒక భాష ఎక్కువా కాదు. మరో భాష తక్కువా కాదు. ఎవరి భాష వారిది. మన భాషలో మనం మాట్లాడడం అనాగరికం అని అనుకోకూడదు. తెలుగులో మాట్లాడితే అనాగరికమూ కాదు. ఇంగ్లీషులో మాట్లాడితే నాగరికమూ కాదు. అవసరాన్ని బట్టి ఏ భాషనైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. భాషను బట్టి మనిషి విలువ పెరగదు. తరగదు. భాషపైన ఎంత పట్టు సాధించగలిగాం, మనలోని భావాలను, మనకున్న విషయ పరిజ్ఞానాన్ని ఆ భాషలో ఎంతవరకు వ్యక్తపరచగలుగుతున్నాము అనేదే ముఖ్యం.

6 comments:

Unknown said...

మీరన్నది నిజమే... మన తెలుగుకి తెగులు పదుతున్నది. ఇందుకు కారణం మనమే... ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఇలా మాట్లాడుతున్న నేను కూడా సగం ఆంగ్లం లోనే మాట్లాడుతాను. ఇందుకు నాకు సిగ్గు గా ఉంది. కానీ నా ఉద్యొగం నన్ను ఆంగ్లం లోనే మాట్లాడమంటుంది.

మీరన్నట్లు "ఇద్దరు తమిళులు కలిస్తే, తమిళంలో స్వేచ్ఛగా సంభాషించుకుంటారు. ఇద్దరు మరాఠీలు ఎదురైతే తనివితీరా మరాఠీలో కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఇద్దరు కేరళీయులు తారసపడితే మలయాళంలో మనసు విప్పి మాట్లాడుకుంటారు.". అది ఉద్యొగం పని గంటల్లో అయినా సరే...

నేను నా ఉద్యొగం పని గంటలలో తప్ప మిగతా అంతా తెలుగు మాట్లాడదామనుకొంటా.. కానీ ఆ ఎనిమిది గంటల ప్రభావం నన్ను ఆంగ్లం వైపుకి మళ్ళిస్తుంది.

సర్లేండి నా ఘోష మీకెందుకు? ఇలానే తెలుగు లో రాస్తూ... తెలుగు గురించి మరింత చెప్పండి. నేను ఏదో ఒక రోజు మారుతాను.

Kathi Mahesh Kumar said...

మాతృభాష గురించి మనలాంటి వాళ్ళు కేవలం కాస్త బాధపడి, మన జీవితాల్లో కాస్త తెలుగుని నింపుకొని స్వాంతనపొందడం తప్ప పెద్దగా చెయ్య గలిగిందిలేదు. ఐదో తరగతికే నన్నయ, తిక్కన పద్యాలు నాచే భట్టీ పట్టించి,తెలుగు అంటే భయపెట్టిన మన తెలుగు భోధనాపద్దతిని మార్చగలమా? ఇంటర్మీడియట్ రాగానే ‘తెలుగులో మార్కులు రావు కన్నా! సంస్కృతం తీసుకో’ అని మన విధ్యార్థులకు చెప్పి, చచ్చిన సంస్కృతాన్ని ప్రోత్సహిస్తూ, మన తెలుగును చంపుతున్న మార్కుల విధానాన్ని పరిమార్చగలమా?

మన తెలుగు భవిష్యత్తును చేతులారా చెడుచుకుంటూ, కాస్త కన్నీరు విడవడమే మన కర్తవ్యంలా ఉంది.

Purnima said...

ikkada english lo type chestunnaduku kshamaapanalu korutunna.. ventane comment raayaali anipinchindi..anduke.

telugu gurinchi meeru chaalaa varaku nijame raasaru. kaani "enduku" ani prasninchukuntoo unte akkade kaalam ayyipotundi. naaku telugu ante chaala ishtam.. maa chellelu visugguntundi.. kaaranam: telugu lo takkuva marks vastaai..percentage effect avutundi ani :-( manaku maname vidhinchukunna konni alavaatla valla... telugu manugada kashtamavutundi.

kaanee telugu ki ee parmaadamoo ledu. meeku veelainantha telugu nu protsahistoone undandi.. telugu kshemamgaa untundi. :-)

atyaavsakyam gaa.. ide vishayam meeda nenoo tapaa raayaali. ;-)

మీనాక్షి said...

మాతృ భాష గురించి చాలా బాగా చెప్పారు.
తెలుగు స్పష్టంగా మట్లాడే వారు కూడా కావాలనే
ఒక్కోసారి రానట్టు నటిస్తారు.
మీరు చెప్పినట్టు ఆకాశం ను ఆకాసం,శైలజ ని సైలు ,అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ఇలాంటి మంచి మంచి టపాలు మీరు ఇంకా రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Shakira said...

మీ స్పందనలకు నా కృతజ్ఞతలు.

మీనాక్షి గారు,
నా భావం సరిగ్గా అర్థం చేసుకొన్నందుకు సంతోషం.

పూర్ణిమ గారు,
తెలుగులో తక్కువ మార్కులు వచ్చాయని తెలుగు మాట్లాడడం మానుకొంటామా! తల్లి సంపన్నురాలు కాదని వదులుకోలేము కదా!

మహేష్ గారు,
నాడు నన్నయ, తిక్కన పద్యాలు కంఠత పట్టడం వలనే నేడు మీరు మంచి తెలుగు వ్రాస్తున్నారు. అవసరం, అవకాశాన్ని బట్టి ఎన్ని భాషలలోనైనా ప్రావీణ్యత సాధించవచ్చు. కాని మాతృభాషని వదులుకోలేము కదా.

అయినా ఇప్పుడు ఇంటర్మీడియట్లో తెలుగులో నూటికి 98 మార్కులు సాధిస్తున్న విద్యార్థులు కూడా ఉన్నారు.

వీరశేఖర్ గారు,
"నేను ఏదో ఒక రోజు మారుతాను" - ఆ వాఖ్యం చాలు. తోటి తెలుగువారు కలిసినప్పుడు తెలుగులో మాట్లాడండి. ఆంగ్ల పదాలు దొర్లినా పర్వాలేదు. ఉద్యోగ సమయంలో ఆంగ్లంలోనే మాట్లాడాలి, తప్పదు కదా! అవసరాన్ని బట్టి ఏ భాష అయినా మాట్లాడుకోవచ్చు. తెలుగులో మాట్లాడడం ఎలా తప్పు కాదో, ఆంగ్లంలో మాట్లాడటమూ తప్పు కాదు. కానీ తెలుగు మాట్లాడటం అనాగరికం అని అనుకోకుంటే చాలు.

షాకిర.

పద్మనాభం దూర్వాసుల said...

పూర్వం ఒకప్పుడు ఎస్.ఎస్.ఎల్.సి వరకు తెలుగు మాధ్యమమే ఉండేది.అప్పుడు ఇంగ్లీషు ప్రమాణం కూడా ఇప్పటి కంటే బాగుండేది.తెలుగు మాధ్యమంలో చదివినా, ఇంటర్మీడియెట్ లో ఇంగ్లీషు మాధ్యమానికి మారడంలో ఎట్టి ఇబ్బంది ఉండేది కాదు.
మీరు వ్రాసిన విషయాలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.