భారత దేశ జనాభా ఎక్కువ. భారత దేశ ఓటర్ల జనాభా కూడా ఎక్కువే. కాని భారత దేశం లో ఓటు హక్కును వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ఓటు హక్కును వినియోగించుకునేవారిలో అత్యధికులు నిరక్ష్యరాస్యులు, సమస్యల పట్ల అవగాహనా లోపం ఉన్నటువంటి పేద ప్రజానీకం. ఎన్నికల పట్ల వీరు చూపే శ్రద్ధ లో పదవ వంతు శ్రద్ధ కూడా మధ్యతరగతి వారు చూపడం లేదు. సమాజ స్థితిగతుల పట్ల కొద్దో గొప్పో అవగాహన కలిగి, అధిక అక్షరాస్యత సాధించిన మధ్యతరగతి ప్రజల పాత్ర ఎన్నికల సమయంలో బహు స్వల్పంగా ఉంటోంది. అంటే ఎన్నికల ఫలితాలు ఒక వర్గ ప్రజల నిర్ణయాన్నే తెలియజేస్తున్నాయి. ఇది శోచనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.

చరిత్ర చూస్తే ఏ విప్లవానికైనా నాంది మధ్యతరగతి ప్రజలే అనేది స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి మధ్యతరగతి ప్రజలు ఎన్నికల పట్ల అనాసక్తి, నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. "ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీలేదు" అనేది వారి వాదన. ఉద్యోగులు ఎన్నికల నిర్వాహణలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించడంలో అశ్రద్ధ చూపుతున్నారు. మరి కొందరు "క్యూ లో అంత సేపు ఎవరు నుంచుంటారు" అని వాపోతున్నారు. మహిళలు "ఇప్పుడు బయటికి ఏమి వెళ్తాములే" అని బద్దకిస్తున్నారు. మధ్యతరగతి వారు ఈ ఆలోచనా సరళిని మార్చుకోవాలి, నిర్లిప్తతనుండి బయట పడాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం వారి ప్రథమ కర్తవ్యముగా గుర్తించాలి. ఐదు సంవత్సరాలు మనలను ఎవరు పాలిస్తే న్యాయం జరుగుతుందో ఓటు ద్వార తెలియజేయాలి. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవాలి. క్యూలో నించోవడం క్రమశిక్షణకు నిదర్శనం అని గ్రహించాలి. పోలింగ్ రోజును సెలవు దినం అనుకోకూడదు. ఆ రోజు మనం గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నామని గుర్తించాలి. పోలింగ్ రోజు పేద ప్రజలలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఓట్లు వేయడాన్ని వీరు "ఓట్ల పండగ" అంటారు. కుటుంబాలు కుటుంబాలు తరలి వెళ్ళి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ పద్దతి మధ్యతరగతి వారికి ఆచరణీయం కావాలి.

మధ్యతరగతి వారు ఎలానూ ఓటు వేయరని నిర్ధారించుకున్న అభ్యర్థులు, వారి ఛాయలకు కూడా పోవడం లేదు. ఓటు ను అభ్యర్ధించడమూ లేదు. నాయకుల సంగతి అటు ఉంచితే, ప్రభుత్వం కూడ పేద ప్రజల సమస్యల పట్ల చూపుతున్న శ్రద్ధ, మధ్యతరగతి వారి సమస్యల పట్ల చూపడం లేదు. ఎలాంటి స్లం ఏరియా లో కూడా సిమెంటు రోడ్లు, వీధి లైట్లు కనిపిస్తున్నాయి కాని ఊరి మధ్యలో కొన్ని చోట్ల ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇది మధ్యతరగతి వారి స్వయంకృతాపరథమే. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు, వివిధ పార్టీ అభ్యర్ధులు పేద ప్రజానీకం పైన వరాల జల్లులు కురిపిస్తున్నారు. మధ్య తరగతి వారిని పట్టించుకున్నా జాడ లేదు. ఇంత నష్టం జరుగుతున్నా ఇంకా నిర్లిప్తత ఎందుకు? ఓటు వెయ్యండి. మీ ప్రాముఖ్యతను మీరు చాటుకోండి. పాలకులను ఎంచుకోవడం లో మీ పాత్రను మీరు పోషించండి.

ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. మన కులస్తులనూ, మతస్తులను గెలిపించుకోవాలనే ఆలోచన కూడదు. అన్ని కులాలను, అన్ని మతాలనూ సమానం గా ఆదరించే అభ్యర్థి, నిజాయితీ పరుడు, విద్యావంతుడు, సమాజ శ్రేయస్సు కోరుకునే అభ్యర్థి, నిస్వార్థపరుడు, ప్రస్తుత సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. డబ్బులు పంచే వ్యక్తి మనకు వద్దు. మద్యం చూపి ఓటు అడిగే అభ్యర్థి అసలు వద్దు. ఆర్భాటంగా ప్రచారం సాగించే వ్యక్తిని పక్కకు పెట్టండి. ప్రచారానికి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టే వ్యక్తి గెలిచిన తరువాత ఆ డబ్బు రాబట్టుకోడానికి ప్రక్కద్రోవ పట్టడా? ఆలోచించండీ. కాబట్టి ఆడంబర ప్రచారానికి మోసపోకుండా నిరాడంబర వ్యక్తికి, మంచివ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటు వేయండి.

కొందరు ఓటర్లు, ప్రజలందరూ ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారో తెలుసుకొని ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇతర అభ్యర్థులకు వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది అని భ్రమ పడుతున్నారు. ఈ ఆలోచన సముచితమయినది కాదు. అన్ని విధాలా యోగ్యుడు అనుకున్న వ్యక్తికే ఓటు వేయండి. ఎవరో ఏదో అన్నారని మీ అభిప్రాయాన్ని మార్చుకుని అసమర్థుడిని సమర్థించకండి.

మన ఇంట్లో కష్టపడి సంపాదించుకున్న మన డబ్బు ఎవరికైనా ఉచితంగా ఇవ్వగలమా? అలా ఇస్తే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుందా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోని డబ్బును ఉచితంగా పంచిపెడితే, ఆ రాష్ట్రం మాత్రం అభివృద్ధి ఎలా సాధిస్తుంది? కులమతాలకు అతీతంగా ఆర్థికముగా వెనుక బడి ఉన్న వారికి చేయూత నీయవలసిందే. వారి కూడు, గుడ్డా, వాళ్ళు సంపాదించుకునేట్టుగా వారిని తయారుచేయవలసిందే. కాని డబ్బు పంచడం వలన ఇది సాధ్యం కాదు. పేద వారు పేద వారు గానే ఉండి పోతున్నారు. కాబట్టి ఉచితంగా డబ్బులు పంచిపెట్టే నాయకులు మనకొద్దు. మన జీవన ప్రమాణం పెంచి తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేసే నాయకుడికి ఓటు వేయండి.

ఓటరు ముందుగా తన సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి.ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుండి మనకు లభిస్తుంది. ఆ తరువాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నారుగా!!!! ఇంకా ఆలోచన ఎందుకు? అడుగు ముందుకు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి.