భారత దేశ జనాభా ఎక్కువ. భారత దేశ ఓటర్ల జనాభా కూడా ఎక్కువే. కాని భారత దేశం లో ఓటు హక్కును వినియోగించుకునేవారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ఓటు హక్కును వినియోగించుకునేవారిలో అత్యధికులు నిరక్ష్యరాస్యులు, సమస్యల పట్ల అవగాహనా లోపం ఉన్నటువంటి పేద ప్రజానీకం. ఎన్నికల పట్ల వీరు చూపే శ్రద్ధ లో పదవ వంతు శ్రద్ధ కూడా మధ్యతరగతి వారు చూపడం లేదు. సమాజ స్థితిగతుల పట్ల కొద్దో గొప్పో అవగాహన కలిగి, అధిక అక్షరాస్యత సాధించిన మధ్యతరగతి ప్రజల పాత్ర ఎన్నికల సమయంలో బహు స్వల్పంగా ఉంటోంది. అంటే ఎన్నికల ఫలితాలు ఒక వర్గ ప్రజల నిర్ణయాన్నే తెలియజేస్తున్నాయి. ఇది శోచనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు.

చరిత్ర చూస్తే ఏ విప్లవానికైనా నాంది మధ్యతరగతి ప్రజలే అనేది స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి మధ్యతరగతి ప్రజలు ఎన్నికల పట్ల అనాసక్తి, నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. "ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీలేదు" అనేది వారి వాదన. ఉద్యోగులు ఎన్నికల నిర్వాహణలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించడంలో అశ్రద్ధ చూపుతున్నారు. మరి కొందరు "క్యూ లో అంత సేపు ఎవరు నుంచుంటారు" అని వాపోతున్నారు. మహిళలు "ఇప్పుడు బయటికి ఏమి వెళ్తాములే" అని బద్దకిస్తున్నారు. మధ్యతరగతి వారు ఈ ఆలోచనా సరళిని మార్చుకోవాలి, నిర్లిప్తతనుండి బయట పడాలి. ఓటు హక్కు వినియోగించుకోవడం వారి ప్రథమ కర్తవ్యముగా గుర్తించాలి. ఐదు సంవత్సరాలు మనలను ఎవరు పాలిస్తే న్యాయం జరుగుతుందో ఓటు ద్వార తెలియజేయాలి. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవాలి. క్యూలో నించోవడం క్రమశిక్షణకు నిదర్శనం అని గ్రహించాలి. పోలింగ్ రోజును సెలవు దినం అనుకోకూడదు. ఆ రోజు మనం గొప్ప కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నామని గుర్తించాలి. పోలింగ్ రోజు పేద ప్రజలలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఓట్లు వేయడాన్ని వీరు "ఓట్ల పండగ" అంటారు. కుటుంబాలు కుటుంబాలు తరలి వెళ్ళి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ పద్దతి మధ్యతరగతి వారికి ఆచరణీయం కావాలి.

మధ్యతరగతి వారు ఎలానూ ఓటు వేయరని నిర్ధారించుకున్న అభ్యర్థులు, వారి ఛాయలకు కూడా పోవడం లేదు. ఓటు ను అభ్యర్ధించడమూ లేదు. నాయకుల సంగతి అటు ఉంచితే, ప్రభుత్వం కూడ పేద ప్రజల సమస్యల పట్ల చూపుతున్న శ్రద్ధ, మధ్యతరగతి వారి సమస్యల పట్ల చూపడం లేదు. ఎలాంటి స్లం ఏరియా లో కూడా సిమెంటు రోడ్లు, వీధి లైట్లు కనిపిస్తున్నాయి కాని ఊరి మధ్యలో కొన్ని చోట్ల ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. ఇది మధ్యతరగతి వారి స్వయంకృతాపరథమే. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు, వివిధ పార్టీ అభ్యర్ధులు పేద ప్రజానీకం పైన వరాల జల్లులు కురిపిస్తున్నారు. మధ్య తరగతి వారిని పట్టించుకున్నా జాడ లేదు. ఇంత నష్టం జరుగుతున్నా ఇంకా నిర్లిప్తత ఎందుకు? ఓటు వెయ్యండి. మీ ప్రాముఖ్యతను మీరు చాటుకోండి. పాలకులను ఎంచుకోవడం లో మీ పాత్రను మీరు పోషించండి.

ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు కులమతాలకు అతీతంగా ఆలోచించాలి. మన కులస్తులనూ, మతస్తులను గెలిపించుకోవాలనే ఆలోచన కూడదు. అన్ని కులాలను, అన్ని మతాలనూ సమానం గా ఆదరించే అభ్యర్థి, నిజాయితీ పరుడు, విద్యావంతుడు, సమాజ శ్రేయస్సు కోరుకునే అభ్యర్థి, నిస్వార్థపరుడు, ప్రస్తుత సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థుడు మనకు కావాలి. అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. డబ్బులు పంచే వ్యక్తి మనకు వద్దు. మద్యం చూపి ఓటు అడిగే అభ్యర్థి అసలు వద్దు. ఆర్భాటంగా ప్రచారం సాగించే వ్యక్తిని పక్కకు పెట్టండి. ప్రచారానికి లక్షలు, కోట్లు ఖర్చుపెట్టే వ్యక్తి గెలిచిన తరువాత ఆ డబ్బు రాబట్టుకోడానికి ప్రక్కద్రోవ పట్టడా? ఆలోచించండీ. కాబట్టి ఆడంబర ప్రచారానికి మోసపోకుండా నిరాడంబర వ్యక్తికి, మంచివ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి ఓటు వేయండి.

కొందరు ఓటర్లు, ప్రజలందరూ ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారో తెలుసుకొని ఆ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇతర అభ్యర్థులకు వేస్తే ఓటు వేస్ట్ అవుతుంది అని భ్రమ పడుతున్నారు. ఈ ఆలోచన సముచితమయినది కాదు. అన్ని విధాలా యోగ్యుడు అనుకున్న వ్యక్తికే ఓటు వేయండి. ఎవరో ఏదో అన్నారని మీ అభిప్రాయాన్ని మార్చుకుని అసమర్థుడిని సమర్థించకండి.

మన ఇంట్లో కష్టపడి సంపాదించుకున్న మన డబ్బు ఎవరికైనా ఉచితంగా ఇవ్వగలమా? అలా ఇస్తే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుందా. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోని డబ్బును ఉచితంగా పంచిపెడితే, ఆ రాష్ట్రం మాత్రం అభివృద్ధి ఎలా సాధిస్తుంది? కులమతాలకు అతీతంగా ఆర్థికముగా వెనుక బడి ఉన్న వారికి చేయూత నీయవలసిందే. వారి కూడు, గుడ్డా, వాళ్ళు సంపాదించుకునేట్టుగా వారిని తయారుచేయవలసిందే. కాని డబ్బు పంచడం వలన ఇది సాధ్యం కాదు. పేద వారు పేద వారు గానే ఉండి పోతున్నారు. కాబట్టి ఉచితంగా డబ్బులు పంచిపెట్టే నాయకులు మనకొద్దు. మన జీవన ప్రమాణం పెంచి తద్వారా సమాజాభివృద్ధికి కృషి చేసే నాయకుడికి ఓటు వేయండి.

ఓటరు ముందుగా తన సమాజంలోని సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలి.ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల గురించి తెలుసుకోవాలి. ఈ సమాచారం వార్తా పత్రికలు, వెబ్ సైట్ల నుండి మనకు లభిస్తుంది. ఆ తరువాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నారుగా!!!! ఇంకా ఆలోచన ఎందుకు? అడుగు ముందుకు వేయండి. ఓటు హక్కును వినియోగించుకోండి.

6 comments:

Anonymous said...

షాకిరా గారు,

"ఎవరు గెలిచినా మనకు ఒరిగేది ఏమి లేదు" అన్న నిస్పృహతో ఉన్న మధ్యతరగతి ప్రజలను మేల్కొల్పటానికి వ్రాసిన ఈ బ్లాగు ఆద్యంతము ఆలోచింపజేసింది. "ఓటు" పట్ల అవగాహన, "ఓటరు"గా బాధ్యత, ఓటరు ఎటువంటి "అభ్యర్థి"ని కోరుకోవాలో అన్న విషయాల గురించి చక్కగా వివరించారు. అన్నట్లు ప్రభుత్వం గురించి, వార్తా పత్రికల గురించి, ఎన్నికల సందర్భంలో పార్టీల వాగ్ధానాల గురించి మెత్తగా చురకలు అంటించారు. ఎప్పటికైనా భారత దేశానికి ఒక యోగ్యుడైన నాయకుడు/నాయకురాలు దొరుకుతారని ఆశిస్తూ.........

ఒక భారతీయుడు.

Shakira said...

భారతీయుడు గారు,

మీ స్పందనకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ప్రోత్సాహము నాకెంతో స్పూర్థిని ఇచ్చింది.

షాకిర.

Avinash Thummadi said...

షాకిరా గారు,

మీ బ్లాగు చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎన్నికల సమయంలో మధ్యతరగతి ప్రజల మనోభావాలను అద్దంపడుతూ వ్రాసిన తీరు ప్రశంసనీయం.

ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్న పేద ప్రజలు డబ్బుకు, మద్యానికి, ఇతర ప్రలోభాలకు లొంగిపోయి తమ విలువైన ఓటును దుర్వినియోగం చేస్తున్నారు. ఇక ఓటర్ల శాతం తక్కువగా ఉన్న ధనవంతులేమో తమ ప్రయోజనాల కోసం ఎన్నికలను పరోక్షంగా శాసిస్తున్నారు. ఇటువంటి సమయంలో మధ్యతరగతి ప్రజలు ఒక ఉన్నతమైన వ్యక్తిని తమ నాయకుడిగా ఎన్నుకోగలిగితే భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించినవారు అవుతారు.

ఇటువంటి బ్లాగులు మీరు ఇంకా చాలా వ్రాసి అందరిని చైతన్యపరచాలని ఆశిస్తూ.......

ఆవినాశ్.

Vijaya Kumar said...

Madam,
Your article is an eye-opener to the middle class which shows a lethargic attitude
towards elections due to multifarious reasons. The governments are formed only
by 'plurality' vote and not by 'majority' vote, as the overall percentage of polling is below 50 per cent, leave alone the votes cast by fake voters among them. When the middle class arise, awake and cast their votes, the result would definitely be tilted in a different way, which will be beneficial to the society/country at large. Let the middle class realise this and help build an egalitarian society under capable leaders, who will have the abilities to work with grit and determination with conscientious minds to live up to the ideals
of true democracy, built on strong foundations.
May your anguish and concern be understood by all the middle class in right perspective.
Vijaya Kumar

Sai Praneeth said...

Shakira garu,

Very nice article about the mentatlity of middleclass towards elections and how they can change the future of Indian politics. I totally agree with the views of Bharatheeyudu garu, Avinash garu and Vijaya Kumar garu.

The only negative thing I feel about your blog is that it has come in a little bit late when the elections of Andhra Pradesh have already completed. If this blog has come in a month earlier, it would have given chance to middleclass to rise for the occassion. Anyhow, once again very nice article.... Keep blogging!!

Sai.

PS: The blog webpage looks beautiful. I read all your other blogs and they are very informative and I like the one about American Politics.

Shakira said...

@ అవినాశ్ గారు,
ధనిక వర్గాల ఆలోచనా విధానాన్ని బాగా చూపించారు. మనమనుకున్నట్లు మధ్యతరగతి ప్రజలు ఒక ఉన్నతమైన వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుని మనకు బంగారు భవిష్యత్తును అందించగలరని ఆశిస్తూ.........మీరిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.....


@ Vijaya Kumar garu,
Thanks for voicing in your apprehension about our colossal political system where the government is formed by disproportional representation and misconstrued electoral exercise. Appreciate for echoing my thoughts that middleclass should leave their complacent approach and bring on a political reform. We deserve a better government, where we actually can lobby.


@ Sai Praneeth garu,
Thanks for your feedback, which is very encouraging. I tried publishing this article long back through Eaanadu Daily. But to my surprise they didn’t do it. As my last attempt (and for my satisfaction) I put it on my blogger. I appreciate your aesthetic sense.

Shakira.