క్రిస్మస్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి - ఏసు క్రీస్తు, మేరి మాత, నక్షత్రం, ఇంకా..... క్రిస్మస్ తాత.

క్రిస్మస్ తాత పిల్లలకు బోలెడు బహుమానాలు, చాక్లెట్లు ఇచ్చేవాడట. అందుకే పిల్లలకు క్రిస్మస్ తాత అంటే చాలా ఇష్టం. ఈ క్రిస్మస్ తాత బొమ్మను, మనం ఇంట్లొ ఆకర్షణీయంగా, అతి సులువుగా తయారు చేసుకొవచ్చు. అది ఎలాగో చూడండి.

కావలసిన వస్తువులు:
1. కోడిగుడ్డు డొల్ల
2. రంగు కాగితం
3. జిగురు లేదా ఫెవిక్విక్
4. నలుపు రంగు స్కెచ్ పెన్
5. దూది

తయారు చేయు విధానం:
ముందుగా రంగు కాగితమును 4 X 4 అంగుళాల సైజులో కత్తిరించుకొని, ఆ కాగితాన్ని పొట్లం చుట్టినట్లు, శంఖువు ఆకారంలో చుట్టి, కాగితం విడిపోకుండా చివరలు జిగురుతో అతికించాలి. ఇది క్రిస్మస్ తాత టోపి. కోడిగుడ్డు డొల్ల సన్నగా ఉండే భాగం పైన ఈ టోపీని బొమ్మలో ఉన్నట్లు అతికించాలి. గుడ్డు డొల్ల క్రిస్మస్ తాత ముఖం. దీని మీద నోరు, కళ్ళు, ముక్కు నలుపు రంగు స్కెచ్ పెన్ తో గీసుకోవాలి. దూదిని గడ్డం, మీసాలు, కనుబొమల ఆకారంలో మలిచి జిగురుతో అతికించాలి. టోపీ మీద చంకీలు అందంగా జిగురుతో అతికిస్తే బొమ్మ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ తాత బొమ్మ రెడీ.

అందంగా కనిపించే ఈ క్రిస్మస్ తాత బొమ్మలు అతి తక్కువ ఖర్చుతో చాలా చేసుకోవచ్చు. వీటిని క్రిస్మస్ ట్రీకి అలంకరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో గోడలకు అలంకరిస్తే ఇల్లు అందంగా ఉంటుంది, బల్లుల బెడద తగ్గుతుంది.

క్రిస్మస్ దగ్గరకు వచ్చేస్తోంది కదా! మీరు ప్రయత్నించి చూడండి.


చిన్నతనంలో ఆడ పిల్లలు పొడుగాటి జడ అంటే చాలు తెగ మోజుపడిపోతారు. పొడుగు జడ ఉన్నవారిని చూసి మురిసిపోతారు. తమకు అంత పెద్ద జడ ఉంటే బాగుండునని కోరుకుంటారు. జడ అందం అలాంటిది మరి.

చిన్న వయస్సులో పొడవు జుట్టు ఉండదు కాబట్టి తల్లి తన కూతురికి క్రాఫ్ దువ్వి వదిలేస్తుంది. జుట్టు కొంచెం ఎదిగితే చిన్న చిన్న పిలకలు వేసి ముచ్చటపడుతుంది. ఈ దశలోనే ఆడపిల్లలు పొడుగాటి జడ మీద మమకారం పెంచుకుంటారు. పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు (అమ్మ చూస్తే కోప్పడుతుందని తెలుసు) సవరమో, నల్ల రిబ్బనో ఎంచుకొని వాటితో తమకు తోచినట్లు పెద్ద జడ అల్లుకొని తెగ సంబరపడిపోతారు. జుట్టు మెడ క్రిందకు జారిన తరువాత తల్లి జడ వేయడం మొదలుపెడుతుంది. అప్పుడు ఆడపిల్లకు జడ ఎలా అల్లాలి అనే ధర్మసందేహం కలుగుతుంది. అమ్మ రోజూ ఎలా అల్లుతుందో గమనిస్తుంది. అల్లడం తేలికని భావించి తాను అల్లడానికి ఉపయుక్తులవుతారు. జడలో రెండు పాయలేగా కనిపించేవి అనుకుని జుట్టును రెండు భాగాలు చేసి జడను అల్లడం ప్రారంభిస్తారు. ఇక్కడే పప్పులో కాలు వేస్తారు. జడలో అటొకటి ఇటొకటి రెండు పాయలే కనిపించినా నిజానికి జుట్టును మూడు భాగాలు చేస్తేగాని జడ అల్లడం సాధ్యం కాదని ఆ పసి మనసుకు తెలియదు. ఇదంతా తెలిసే సరికి పిల్లలు ఎదిగిపోతారు. జుట్టును చిక్కు లేకుండా దువ్వి, మూడు సమభాగాలు చేసి అందంగా జడ అల్లడం కస్టమే సుమా - అని అప్పుడు అనుకుంటారు.

దక్షిణ భారతదేశంలో జడ చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అందునా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో దీనికి విశిష్ట స్థానం ఉంది. ఆడపిల్ల అందాన్ని ఇనుమడింపజేసే అంశాలలో జడ ఒకటి అనడంలో సందేహం లేదు. అందుకేనేనేమో ఎందరో కవులు జడ సొగసు మీద ఎన్నో కవితలు రాశారు. శాస్త్రీయ నృత్యాలయిన కూచిపూడి, భరతనాట్యం జోలికి వెళ్ళదలచుకుంటే ఆడపిల్లకు జడ చాలా అవసరం. అది లేకుంటే ఆహార్యంలో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సత్యభామ ఠీవికి అసలు కారణం ఈ జడే. పొడుగాటి జడ వయ్యారంగా తిప్పుతూ "మీరజాలగలడా నా ఆనతి" అని సత్యభామ నర్తిస్తుంటే జనం కళ్ళప్పగించి చూడ వలిసినదే.

ఆరు అణాల అంధ్రా అమ్మాయి అంటే జడ ఉండి తీరాల్సిందే. పెళ్ళి కూతురు అనగానే మన మదిలో మెదిలేది బారెడు పూల జడే. జడకు అంత ప్రాముఖ్యత ఉండబట్టే ఆడపిల్లను కుదురుగా కూర్చోబెట్టి అమ్మో, అమ్మమ్మో, నాయనమ్మో, జాగ్రత్తగా చిక్కు తీసి, నూనె రాసి జుట్టు దువ్వేవారు. బిగించిమరీ జడలేసేవారు. జుట్టు చివరిలో చిట్లితే పెరగవేమోనని రిబ్బను వేసిమరీ అల్లేవాళ్ళు. కాసేపు జుట్టు వదిలేసినా "దయ్యంలా ఎంటాజుట్టు విరబోసుకు తిరగడం" అని పెద్దవాళ్ళు మందలించిన సందర్భాలు లేకపోలేదు. జుట్టును జడరూపంలో మలిస్తే, ఒక్క వెంట్రుక కూడా రేగే అవకాశం ఉండదు కదా, తలకట్టు చాలా శుభ్రంగా కనిపిస్తుంది. జుట్టు రేగితే "కాకిగూడు" అనో, "చింపిరిజుట్టు" అనో సాటివారు ఏడిపించడం పరమ సాధారణం. ఇది ఒకప్పటి సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే నేడు "జడ" కనుమరుగయిపోతున్నది. అంధ్రుల నాగరికతను వెలుగెత్తి చాటే ఒక అంశం అయిన జడను వేసుకోడానికి నేటి యువతరం విముఖత వ్యక్తపరుస్తోంది. పల్లెటూర్లలో, పట్టణాలలో జడ కొంతమేరయినా కనిపిస్తుంది కాని, నగరాలలో జడ చేజారిపొయిందనే చెప్పాలి. దీనికి సవాలక్ష కారణాలు - జడ వేసుకునే సమయం లేని యాంత్రిక జీవితం, జడ అల్లుకునే ఓర్పు నశించడం, చినప్పుడే పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్సులో పడివేయడం, పెద్దజుట్టు ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, పెద్దజుట్టు ఉన్నా తలంటు కష్టం అనే భావనతో జుట్టు కత్తిరించుకోవడం, బాబ్ పోనీ నాగరికత చిహ్నాలుగా మారడం, బాబ్ పోనీ దువ్వడం సులభకరం కావడం, పాశ్చాత్య నాగరికతా వ్యామోహం - లా కర్ణుడి చావుకు లక్షాతొంభై కారణాలు.

సాధారణంగా యువతరం సినీ నాయికలను, బుల్లితెర మీద కనిపించే స్త్రీలను అనుసరిస్తుంటారు. నేటి సినిమాలలో జడ కేవలం ఒక పేదింటి అమ్మయికి లేదా చదువు లేని పల్లెటూరి అమ్మాయికి పరిమితమయిపోయింది. చదువుకున్న అమ్మాయికి జడ ఉండదు, ఉండకూడదు. బాబ్ లేక పోనీ ఉండాలి. ఇది నేటి పరిస్థితి. గొప్పింటి పిల్లకు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా జడ కనుమరుగై పోయింది. తెలుగు ప్రజల కోసం తెలుగువారు నిర్వహిస్తున్న, తెలుగు టీ.వీ చానల్సు లోని తెలుగింటి యాంకర్లు కూడా జడను చిన్న చూపే చూస్తున్నారు. పండగలకు పబ్బాలకు మాత్రం పట్టుచీర కట్టుకొని వంటినిండా నగలతో (వడ్డాణం కూడ వదలరు సుమా) ముస్తాబవుతున్నారు. కాని జడ జోలికి మాత్రం పోవడం లేదు. దీనితో మధ్య తరగతి యువతులు కూడా జడ వేసుకోవడం అనాగరికం అనే భావనకు వచ్చేసినట్లున్నారు. ఏది ఏమైనా నేటి యువత బాబ్ చేసుకుని జుట్టు ముఖం మీద పడుతుంటే చికాకు పడకుండా, సుతారంగా సర్దుకోవడం నాగరికం - అనే దశకు చేరుకున్నారు.

ఒక తెలుగింటి అమ్మయిని ఎవరైనా ఎలా ఊహిస్తారు? అదే చిత్రాకారుడైతే ఎలా చిత్రీకరిస్తాడు? రెండు సందర్భాలలోను బారెడు జడ నడుముపై నర్తిస్తున్న అమ్మాయే మన ఊహల్లో కదలాడుతుంది. తెలుగింటి ఆడపిల్లకూ, బారెడు జడకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. అందుకేనేమో కొందరు తెలుగింటి ఆడపడుచులు వృత్తిరీత్యా లేదా చదువురీత్యా దేశాలు వెళ్ళినా, విడుపు లేక జడ సాంప్రదాయాన్ని అక్కడ కూడా కొనసాగిస్తున్నారు. మరికొందరు విదేశీ సాంప్రదాయం మేర అక్కడ బాబ్ చేసుకొని జుట్టు వదిలేసుకున్నా ఇక్కడకు వచినప్పుడు చక్కగా జడ వేసుకుంటున్నారు. తెలుగు వారి జడ సంస్కృతి చిరకాలం కొనసాగాలంటే, జడ సంస్కృతిని కూడా ప్రాచీన సంస్కృతిగా చట్టం తీసుకురావాలేమో.

జుట్టును మనం కోరిన రీతిలో మలచుకునే స్వేఛ్ఛ మనందరికీ ఉంది. పూర్తిగా వ్యక్తిగత విషయం. ఇందులో తలదూర్చే అధికారం ఎవరికీ లేదు, కాని వ్యక్తిగత స్వేఛ్ఛకు మించినది ఒకటి ఉన్నది - అది సామాజిక భాధ్యత. మన మంచి సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాల వారికి అందించడం మన బాధ్యత. జడ అనాగరిక చిహ్నం, బాబ్ నాగరిక చిహ్నం అనే భావన మనం విడనాడాలి. లేకుంటే భావి తరాల వారు తెలుగింటి అమ్మాయి బొమ్మను బాబ్ తో ఊహించే (చిత్రీకరించే) ప్రమాదం ఏర్పడుతుంది.