తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అంటారని తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగును "దేశభాషలందు తెలుగు లెస్స" (less కాదు సుమా!) అని కొనియాడిన సంగతీ తెలుసు. సి. పి. బ్రౌన్ అను ఆంగ్ల మహనీయుడు భారతదేశం వచ్చి, తెలుగు నేర్చుకొని, తెలుగు మీది మమకారంతో తాళపత్రాల రూపంలో ఉన్న తెలుగు సాహిత్యాన్ని వెలికి తీయించి, గ్రంథాలుగా ముద్రించి, తెలుగుకు అపార సేవ చేసిన విషయం తెలుసు. అంతే కాదు, ఆయన ఆంగ్లం నుండి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లానికి, నిఘంటువులు వ్రాసి, వాటిని ముద్రించి, మనకు అందుబాటులో ఉంచిన సంగతీ తెలుసు.
మరి ఇన్ని విశిష్టతలున్న తెలుగుభాష నేడు ఎంత నిరాదరణకు గురి అవుతున్నదో మనకెందుకు తెలియడం లేదు? ఈ నిరాదరణకు కారణం మనమే అని కూడా తెలియడం లేదే!
మనసుకు బాధ కలిగినా, శరీరానికి గాయమైనా అనాలోచితంగా, మన నోటి వెంట వెలువడే పదం "అమ్మ". ఇది ప్రేమతో కూడిన తెలుగువారి కమ్మని పదం. 'Mummy' అనే పదంలో ఈ కమ్మదనం మనకు కలుగుతుందా? క్రిందపడినప్పుడు 'అమ్మా'కి బదులు 'Mummy' అనగలమా? నేటి సమాజంలో 'అమ్మా అనే ఈ పదం ఆప్యాయతను కొల్పోయి, క్రింది ఉద్యోగస్తులు, పై ఉద్యోగినిని; పనిమనిషి, యింటి యజమానురాలిని సంబోధించడానికి పరిమితమవడం శోచనీయం.
ఇద్దరు తమిళులు కలిస్తే, తమిళంలో స్వేచ్ఛగా సంభాషించుకుంటారు. ఇద్దరు మరాఠీలు ఎదురైతే తనివితీరా మరాఠీలో కుశల ప్రశ్నలు వేసుకుంటారు. ఇద్దరు కేరళీయులు తారసపడితే మలయాళంలో మనసు విప్పి మాట్లాడుకుంటారు. మరి తెలుగు వారు.......? తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగులో సంభాషించుకోవడానికి ఎందుకు అయిష్టత చూపుతున్నారు? తెలుగు మాట్లాడటం అనాగరికం అని, ఎదుటివారు చిన్నచూపు చూస్తారని అనుకొంటున్నారే? వచ్చీరాని ఇంగ్లీషు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు గాని, తెలుగు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.
నా చిన్నప్పుడు స్కూల్లో కొంతమంది విద్యార్థులు 'తెలుగు 'ని 'తెగులు ' అని హాస్యాన్ని పలికేవారు. అప్పుడు మా టీచర్ వారి చెవి మెలిపెట్టి, 'తెలుగు ' అని వారిచే 100 సార్లు చెప్పించి, వ్రాయించేవారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 'నిజంగానే తెలుగుకి తెగులు పట్టిందా' అని.
ఈ మధ్య గమనిస్తున్నాను. విద్యార్థులు, తెలుగు మీడియంలో చదవడం వలన, కాలేజీలో ఆంగ్ల మాధ్యంలో చదవలేకపోతున్నాం అంటున్నారు. ఇది వాస్తవం కాదు. మాతృభాష మీద పట్టు సాధించినపుడు మాత్రమే విద్యార్థి మరే భాషనైనా నేర్చుకోగలుగుతాడు. నేటి విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదవలేక విఫలమవడానికి కారణం, మాతృభాషమీద పట్టు సాధించలేక పోవడమే. పూర్వం విద్యార్థులు ఎందరో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు స్కూల్లో తెలుగు మాధ్యమంలో చదివి, కాలేజి చదువులను ఆంగ్ల మాధ్యమంలో కొనసాగించి రెండు భాషలలోనూ పట్టు సాధించి ఉన్నత పదవులను అలంకరించి, ఎంతో కీర్తి గడించలేదా?
మాతృభాషను నిర్లక్ష్యం చేయడం, మాతృమూర్తిని నిర్లక్ష్యం చేయడమే. ఇది క్షమార్హం కాదు. ఇప్పటికే తెలుగులో చాలా ఇంగ్లీషు పదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని పదాలను ఆంగ్లంలోనే వాడుతున్నాం. తెలుగు పదాలు వాడుకలోనే లేకుండా పోయినాయి. 'Road ' అంటే బాట అని చాలా తక్కువ మందికి తెలుసు. 'Pen ' అంటే తెలుసుగాని 'కలం' అంటే తెల్లముఖమే! 'Train' ని 'ధూమశకటం' అంటారని బహుకొద్ది మందికే తెలుసు. ఇలా కొన్ని తెలుగు పదాలు వాడుక నుండి తప్పుకున్నాయి. ఒక్క ఇంగ్లీషు పదం లేకుండా తెలుగు మాట్లాడలేని పరిస్థితి మనది. దీనికి తోడు 'శ ' కు బదులు 'ష ' పలకడం నాగరికం అయిపోయింది. 'ఆకాశం'ని 'ఆకాషం'గా, 'అవకాశం'ని 'అవకాషం'గా, 'శేఖర్ 'ని 'షేఖర్ 'గా, 'శైలజ 'ని 'షైలజ 'గా పలుకుతూ, అదే నాగరికత అని మురిసిపోతున్నాం. తెలుగుని ఇంత కల్తీ చేస్తే, మనం మన భావితరాలకు స్వచ్ఛమైన తెలుగు అందివ్వగలమా?
అన్ని భాషలు సమానమని మనం గ్రహించాలి. ఒక భాష ఎక్కువా కాదు. మరో భాష తక్కువా కాదు. ఎవరి భాష వారిది. మన భాషలో మనం మాట్లాడడం అనాగరికం అని అనుకోకూడదు. తెలుగులో మాట్లాడితే అనాగరికమూ కాదు. ఇంగ్లీషులో మాట్లాడితే నాగరికమూ కాదు. అవసరాన్ని బట్టి ఏ భాషనైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. భాషను బట్టి మనిషి విలువ పెరగదు. తరగదు. భాషపైన ఎంత పట్టు సాధించగలిగాం, మనలోని భావాలను, మనకున్న విషయ పరిజ్ఞానాన్ని ఆ భాషలో ఎంతవరకు వ్యక్తపరచగలుగుతున్నాము అనేదే ముఖ్యం.